హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఏడుగురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. మరీ దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. వీరిలో ఏడుగురు రాష్ర్టానికి చెందిన వారే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున జేఈఈ పేపర్1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలంగాణ నుంచి రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హుండేకర్ విదిత్, వెంకటసాయి తేజ మదినేని, శ్రీయశాష్ మోహన్ కల్లూరి, తవ్వ దినేశ్ రెడ్డిలు 100 పర్సంటైల్‌తో అద్భుత ప్రతిభ కనబరిచారు.
తెలంగాణ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ముగ్గురి చొప్పున, హర్యానా, ఢిల్లీ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కరు చొప్పున వందకు వందశాతం మార్కులు సాధించారు. అయితే, వీరికి ర్యాంకులు మాత్రం భిన్నంగా ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. దీంతో వీరందరికీ మొదటి ర్యాంకు రాదని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో 11.70 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు.
కాగా, జేఈఈలో ఒకే విడతలో రాష్ట్రం నుంచి ఇంత మంది 100 పర్సంటైల్ సాధించడం ఇదే మొదటిసారి. అయితే 100 పర్సంటైల్ సాధించిన శ్రీయశాష్ మోహన్ కల్లూరి జాతీయ అథ్లెట్ కావడం విశేషం. జేఈఈ పరీక్షకు మూడు వారాల ముందు రాయపూర్‌లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీయశాష్ మోహన్ కల్లూరి పాల్గొన్నారు. అయితే జేఈఈ పరీక్షల కారణంగా చైన్నైలో జరిగిన ఫైనల్ పోటీలకు హాజరుకాలేదు. ఇటు చదువుల్లోనూ… ఇటు ఆటల్లోనూ శ్రీయశాష్ మోహన్ కల్లూరి మేటిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకొన్నారు.
క్యాటగిరీ ర్యాంకుల్లోనూ..
జనరల్ క్యాటగిరీ, రిజర్వేషన్ క్యాటగిరీ ర్యాంకుల్లోనూ తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. పీడబ్ల్యూడీ ఆలిండియా టాపర్‌గా రాష్ర్టానికి చెందిన చుంచికల శ్రీచరణ్, ఈడబ్ల్యూఎస్ జనరల్ టాపర్లుగా శ్రీసూర్య వర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ టాపర్‌గా జగన్నాథం మోహిత్‌లు టాపర్లుగా నిలిచారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ బీటెక్ పరీక్షలను నిర్వహించగా, ఆయా ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. తొలి విడతలో రాసిన వారు రెండో విడత జేఈఈకి హాజరుకావొచ్చు. ఆ తర్వాత రెండింటి ఫలితాల్లో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొంటారు.
స్టేట్ టాపర్స్ మాటల్లో…
కంప్యూటర్ సైన్స్‌లో రిసెర్చ్ చేస్తా
అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి.. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరుతా. చదువు పూర్తయ్యాక కంప్యూటర్ సైన్స్‌లో రిసెర్చ్ చేస్తా. అమ్మానాన్న ఇద్దరు ఇస్రో సైంటిస్ట్‌లు. కానీ అమ్మ మా చదువుల కోసం ఉద్యోగం వదిలిపెట్టింది. సబ్జెక్టుకు మూడు గంటల చొప్పున రోజుకు 9 గంటలు మాత్రమే ప్రిపరేయ్యా. నా విజయానికి ఆకాశ్ ఫ్యాక ల్టీ ఎంతో కృషి చేసింది.
-రిషి శేఖర్ శుక్లా
ఫిజిక్స్‌లో రిసెర్చ్ చేస్తా
నాన్న కిరణ్‌చంద్ర సాఫ్ట్వేర్ కం పెనీలో భాగస్వామి గా ఉన్నారు. నేను ఆర్చరీ క్రీడాకారుడ్ని. అథ్లెట్‌గా ఖేలో వరుసగా మూడేండ్లు తె లంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించా. జేఈఈలో మంచి ర్యాంకు సాధించడం సంతోషాన్నిచ్చింది. చదువుల అనంతరం ఫిజిక్స్‌లో రిసెర్చ్ చేస్తా.
– శ్రీయశాష్ మోహన్ కల్లూరి
పేదలకు సేవ చేస్తా
జేఈఈలో 100 పర్సంటైల్ రావడం చాలా సంతోషం. ప్రిపరేషన్ సమయంలో టెన్షన్ పడలేదు. అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరతా. పేదల కోసం ఏదో ఒకటి చేయాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రిసెర్చ్ చేస్తా.
– హుండేకర్ విదిత్
కంపెనీ పెడతా.. సీఈవోనవుతా
నాన్న రైస్‌మిల్ నడుపుతారు. అమ్మ గృహిణి. నా చదువుల కోసమే మా కుటుంబం హైదరాబాద్‌కు మారింది. జేఈఈ కోసం రోజు కు 13 గంటలు చదివాను. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడుతూ.. పాటలు వినేవాడిని. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరాలన్నది నా లక్ష్యం. కంపెనీ పెట్టి సీఈవో అవుతా.
– వెంకట సాయితేజ మదినేని
సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి సన్నద్ధమయ్యా
మా కుటుంబం అమీర్‌పేటలో ఉంటుంది. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. టీవీ చూడకుండా.. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి జేఈఈకి ప్రిపేరయ్యా. మొదట నుంచే ఐఐటీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకొన్నా. పరీక్షరాసిన తర్వాత 300కు 300 మార్కులొస్తాయని ముందే ఊహించా. అడ్వాన్స్‌డ్‌పై దృష్టిపెట్టడమే నా టార్గెట్. మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరతా. రోజుకు 10 -12 గంటలు చదివేవాడిని. మా నాన్న ఇచ్చిన టిప్స్.. సహకారం తోడ్పడింది.
-రోహన్ సాయి పబ్బ
సివిల్స్ రాసి ఐఏఎస్ అవుతా
నాన్న జైళ్లశాఖలో పని చేస్తారు. తల్లి గృహిణి. 5వ తరగతిలో ఉన్నప్పుటి నుంచి ఐఐటీ గురించి పునాదుల పడ్డాయి. ప్రిపరేషన్లో భాగంగా అప్పుడప్పుడు టెన్షన్ పడ్డా.. తల్లిదండ్రులు, లెక్చరర్లు స్ఫూర్తి నింపారు. ప్రతిరోజు ఉదయం 6:30 గం టల నుంచి రాత్రి 10:30 గంటల వరకు చదివాను. ప్రతిరోజూ కచ్చితంగా 7 గంటలు నిద్రపోయేవాడిని. ఒత్తిడిని అధిగమించేందుకు ఆదివారం సినిమాలు చూసేవాడిని. ఉన్నత చదువుల అనంతరం సివిల్స్ రాసి.. ఐఏఎస్ అవుతా.. పేదలకు సేవచేస్తా.
– తవ్వ దినేశ్‌రెడ్డి
ఐఐటీ బాంబేలో చేరతా
జేఈఈ ప్రిపరేషన్ సమయంలో లెక్చరర్స్ గైడెన్స్ ఉపయోగపడింది. 10 – 15 మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యా. దీంతో తప్పులు చేయడం తగ్గించుకొన్నా. మానసిక ఒత్తిడిని జయించేందుకు టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరాలన్నది నా లక్ష్యం
– ఎం అనూప్