మహబూబ్‌నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్‌హౌస్‌కు అనుసంధానించిన 400 కేవీ లైన్లో శుక్రవారం ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు సరఫరా సాఫీగా సాగింది. దీంతో ఏదుల రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ మార్గం సుగమమైంది. సీఎం ఇచ్చిన 14 రోజుల టార్గెట్‌కు ముందే ఈ పని పూర్తిచేశామని, త్వరలోనే డ్రైరన్ కూడా నిర్వహిస్తామని నీటి పారుదలశాఖ సీఈ హమీద్‌ఖాన్ వెల్లడించారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను అభినందించారు. నిర్ధిష్ట గడువులోగా రిజర్వాయర్‌లో నీరు నింపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఈ శ్రీరాంనాయక్, సీఈ లతావినోద్, ఎస్ఈలు విజయ భాస్కర్‌రెడ్డి, మాణిక్యరావు, ఈఈలు రాము, రవీందర్, మహేందర్‌రెడ్డి, హరిప్రసాద్, డీఈలు సత్యనారాయణగౌడ్, దశరథ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.