Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా రైతులు, హైదరాబాద్లోని మూసీ బాధితుల మధ్య తగదాలు సృష్టించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్, మాజీ సంపాదకుడు కే శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే అణచివేస్తామనే ఆవేశపూరిత ప్రకటనలు సరికాదని హితవు చెప్పా రు. నిర్జీవమైన మూసీ నదికి పునర్జీవం పోయాల్సిందేనని, అయితే, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళికబద్ధంగా ప్రక్షాళన చేయాలని పలువురు వక్తలు సూచించారు.
నిర్వాసితులుగా మారుతున్న ప్రజలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారకభవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘హైడ్రా కార్యకలాపాలు- మూసీ నది ప్రక్షాళన- పేద, మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సభకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్, సామాజికవేత్త ప్రొఫెసర్ జీ హరగోపాల్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణతో పాటు పలువురు మేధావులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూసీ నిర్వాసితులకు సముచితమైన పరిహారం, మెరుగైన జీవనోపాధిని కల్పించేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళన అంటే కేవలం ఇండ్లను కూలగొట్టడమే కాదనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని సూచించా రు. నిర్వాసితుల బాధలు, సమస్యలను ప్రభు త్వం మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు. సంపూర్ణమైన పరిహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించిన తర్వాతే నిర్వాసితులను తరలించాలని సూచించారు. పాలకులు ఎలాం టి ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారించడం సరికాదని పేర్కొన్నారు.
మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను ప్రభు త్వం ఒప్పించి, మెప్పించి, అండగా నిలిచిన తర్వాతే ప్రాజెక్టును చేపట్టాలని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. మూసీనదిపై ఆధారపడిన వారందరికీ మెరుగైన జీవన పరిస్థితులను కల్పించాలని కోరారు.
ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా డీపీఆర్ ఉం డాలని కానీ, అవేవీ లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ పేర్కొన్నా రు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… ప్రభు త్వం నమూనా పెట్టుబడి వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నదని, ఎప్పుడూ ఆ వ్యవస్థలే ప్రభుత్వాలను ముందుండి నడిపిస్తున్నాయని వివరించారు. రియల్ఎస్టేట్ రంగమే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నదని విమర్శించారు. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన కోసం 20 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామని వివరించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మూసీ బాధితులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
తనకు 600 గజాల స్థలం ఉన్నదని, దీనికి ప్రభుత్వం పరిహారం ఏమిస్తుందని బాధితుడు ప్రసాద్ ప్రశ్నించారు. అమీన్పూర్కు చెందిన హైడ్రా బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 40 ఏండ్ల కిత్రం నాటి ఈసీలను పరిశీలించిన తర్వాతే తాను స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. కానీ, అధికారులు వచ్చిన నోటీసులు అంటించిన మరుసటి రోజే తమ ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తన కుటుంబం మొత్తం రోడ్డు పాలైందని కన్నీరు పెట్టుకున్నారు.