హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో పాఠశాల విద్య అత్యంత సంక్షోభంలో ఉన్నది.. బోధన అభ్యసన రంగాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ ఎమర్జెన్సీ (విద్యా అత్యయిక పరిస్థితి)ని విధించాలని ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అభిప్రాయపడింది. పాఠశాల విద్యలో భారీ సంస్కరణలు అవసరమని ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ‘స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్-స్టేటస్ అండ్ సజెస్టెడ్ పాలసీ మెజర్స్’ పేరుతో సంస్థ ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికపై శుక్రవారం నారాయణగూడలోని భారత్ కాలేజీలో సంస్థ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, గోనారెడ్డి, గోపాల్‌రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యలో ఇప్పటికే పూడ్చలేనంత నష్టం జరిగిందని, ప్రభుత్వం ఏ మాత్రం జాప్యం చేయొద్దని, ఈ అభ్యసన సంక్షోభం నుంచి బయటపడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రంలో పర్యవేక్షణ గాడితప్పిందని, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీచేసి, ఎడ్యుకేషనల్ గవర్నెన్స్‌ను మరింత పటిష్టం చేయాలని టీడీఎఫ్ సూచించింది. పాఠశాల విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్లో 16-17 వేల కోట్లు ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలకే సరిపోతాయని, 15 శాతం నిధులను కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
1,007 పోస్టులకు..పనిచేస్తున్నది 58 మందే..
విద్యాశాఖలో పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పింది. ఏండ్లుగా పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీచేసిన దాఖలాల్లేవు. పర్యవేక్షణాధికారులు సహా ఉపాధ్యాయ విద్యకు సంబంధించి 1,007 పోస్టులు ఉంటే కేవలం 58 మంది పనిచేస్తున్నారు. దాదాపు 950 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎంఈవో పోస్టులు 539 ఉంటే, ప్రస్తుతం 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గెజిటెడ్ హెచ్‌ఎంలకే ఎంఈవోలుగా ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. వివిధ జిల్లాల్లో 5, 6 మండలాలకు ఒక ఎంఈవో చొప్పున పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక జిల్లాలో అయితే 14 మండలాలకు ఒక్కరే ఎంఈవోగా వ్యవహరించారు. డైట్ కాలేజీల్లో 286కు 265, ప్రభుత్వ బీఈడీ కాలేజీల్లో 90 పోస్టులకు 85 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.