హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : అట్టడుగువర్గాలకు ఉన్నత విద్య అందించడంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందువరుసలో నిలుస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా లక్షలాది మందిని విద్యాధికులుగా తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. అన్నివర్గాలకు సమానావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పాఠశాల, ఇంటర్ విద్య దాటని ఆదివాసీ బిడ్డలతోపాటు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉన్నత విద్యాయోగం కల్పించాలని నిర్ణయించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించింది. దేశంలోనే ట్రాన్స్జెండర్లకు ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించిన తొలి వర్సిటీగా ఘనత దక్కించుకున్నది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పిల్లలే చదువుతున్నారు. నలభై ఏండ్ల ప్రస్థానంలో లక్షలాదిమంది దిగువ మధ్యతరగతి, పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో ఇంకా కొన్ని వర్గాలు ఉన్నతవిద్యకు నోచుకోవటం లేదని గుర్తించింది. వీరిలో గోండు, కోయ, చెంచు తెగలు ఉన్నట్టు తేల్చింది. అలాగే ఫీజుల భారంతో దివ్యాంగులు, సామాజిక వివక్షతో ట్రాన్స్జెండర్లు సైతం ఉన్నత విద్యకు దూరంగా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చింది. ఇందులో భాగంగానే సమాన విద్యావకాశాలకు ప్రణాళికలు రూపకల్పన చేసింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి అడవిబిడ్డలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించాలని భావించింది. ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్స్టెప్’ అనే నినాదం స్ఫూర్తితో ఆదివాసీ ఉచిత విద్యాప్రణాళికను ప్రారంభించింది.
ఏ యూనివర్సిటీలో లేనివిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తక్కువ ఫీజు, అంటే ఏడాదికి కేవ లం రూ.3,200లకే డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. కేవలం రూ.500 నామమాత్రపు ఫీజుతో డిగ్రీలో ప్రవేశానికి అవకాశం కల్పించారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విదార్హత కలిగిన వారికి నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ విద్యార్హతలు లేనివారికి ప్రవేశపరీక్ష ద్వారా కోర్సుల్లో చేర్చుకుంటున్నారు.