Sports Calendar | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయిలోనే ఆటలను ప్రోత్సహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ అంశాలపై దృష్టిపెట్టేందుకు ప్రత్యేకంగా విద్యాక్యాలెండర్ను రూపొందించి విడుదల చేస్తున్నట్టుగానే ఆటలకు ప్రత్యేకంగా క్యాలెండర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంవత్సరంలో నెలవారీగా క్యాలెండర్‌ను రూపొందిస్తారు. ఈ బాధ్యతలను ఎస్జీఎఫ్ బాధ్యులకే అప్పగించారు. ఆట స్థలాలు లేనిచోట వాటిని ఏర్పాటు చేస్తారు. అండర్-14, అండర్ -17, అండర్-19 పోటీలను నిర్వహించి, క్రీడాకారులను వెలికితీస్తారు. మండల జోనల్, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలను నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి పోటీలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. మేడ్చల్ జిల్లాల్లో స్టేట్ సైక్లింగ్, రైఫిల్‌షూటింగ్, అథ్లెటిక్స్, చెక్, వాలీబాల్, రంగారెడ్డి జిల్లాలో క్రికెట్, జిమ్నాస్టిక్స్ గేమ్‌లను నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలోనే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈ దిశగా అడుగులేస్తున్నది. ఇందుకు సర్కారు స్కూళ్లకు విద్యాశాఖ స్పోర్ట్స్ గ్రాంట్‌ను సైతం మంజూరుచేస్తున్నది. ఒక్కో ప్రాథమిక స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున స్పోర్ట్స్ గ్రాంట్‌ను మంజూరుచేస్తున్నది. పీడీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ)ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన సోమవారం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రూ.400 చెల్లించి 11వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 12న సీట్లను కేటాయిస్తారు. 16 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతోపాటు, నేరుగా సీటు వచ్చిన కాలేజీల్లోను రిపోర్ట్చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. జాబితా, వివరాలను https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కాగా, 2022 డిసెంబర్ 30, 31న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలోని లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కాలరీస్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఎన్నికైన సంఘాలకు సంస్థ సీఎండీ ఎన్ బలరాం, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డీ శ్రీనివాసులు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి సంస్థ జీఎం కోఆర్డినేషన్ ఎస్డీఎం సుబానీ, కవితానాయుడు, రాజ్‌కుమార్, త్యాగరాజన్ పాల్గొన్నారు.