హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన విద్యాకమిషన్‌కు, రాష్ట్ర విద్యాశాఖకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదా? విద్యాకమిషన్ వర్సెస్ విద్యాశాఖ అన్నట్టుగా పరిస్థితి తయారైందా? ప్రస్తుత పరిస్థితిని చూస్తే అలాంటి వాతావరణమే కనిపిస్తున్నది. విద్యాశాఖకు, విద్యాకమిషన్‌కు అస్సలు పొసగడం లేదనే టాక్ వినిపిస్తున్నది.
విద్యాకమిషన్ అతి జోక్యాన్ని విద్యాశాఖ జీర్ణించుకోలేకపోతున్నదనే చర్చ నడుస్తున్నది. సమీక్షలు, సదస్సుల పేరుతో విద్యాకమిషన్ హడావుడి చేస్తుండటంతో కీలక ఉన్నతాధికారులు వీటికి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. విద్యాకమిషన్ అధ్యయనం, సమావేశాలు, పర్యటనలు, తనిఖీలు, పబ్లిక్ హియరింగ్స్ పేరిట జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నది. కమిషన్ ఇప్పటివరకు ప్రభుత్వానికి ఏడు నివేదికలను సమర్పించింది. కమిషన్ సమర్పించిన నివేదికలు, సూచించిన సిఫారసుల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కోల్డ్‌వారే కారణమన్న వాదనలున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాకమిషన్ ఎందుకు? సిఫారసులు ఎందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బిల్లు రూపొందించడంపై విమర్శలు
విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై సిఫారసులు చేయాల్సిన విద్యాకమిషన్ ఇటీవల డ్రాఫ్ట్ బిల్లును రూపొందించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించాల్సిన బిల్లును విద్యాకమిషన్ ఎలా రూపొందిస్తున్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ‘తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లు-25’ పేరుతో విద్యాకమిషన్ ఒక బిల్లును సిద్ధం చేసింది.
ఈ బిల్లు విషయంపైనే అటు విద్యాకమిషన్, ఇటు విద్యాశాఖ మధ్య అంతరం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే రెండింటి మధ్య విబేధాలకు దారితీసిందనే చర్చ నడుస్తున్నది. వాస్తవానికి విద్యాకమిషన్ అనేది కేవలం సిఫారసులు చేయాల్సిన సంస్థ మాత్రమే. కానీ, డ్రాఫ్ట్ బిల్లును తయారుచేయడమంటే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనన్న భావనతో ఉన్న విద్యాశాఖ వర్గాలు ఈ అంశాన్నే పక్కనపెట్టేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఫీజు నియంత్రణ ఇప్పట్లో సాధ్యంకాదని, వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనన్న ప్రచారం జరుగుతున్నది. కమిషన్ సిఫారసుల ఆధారంగా బిల్లును తాము రూపొందించాల్సి ఉంటుందని, తాము చేయాల్సిన పనిని విద్యాకమిషన్ చేస్తే ఎట్లా? అని ఒక అధికారి ప్రశ్నించడం గమనార్హం.
కమిషన్ సిఫారసులపై స్పందించని సర్కార్