హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): బడా స్కూళ్లను వదిలిపెట్టి చిన్నా చితకా స్కూళ్లపై బ్రహ్మస్ర్తాలు గురిపెట్టవద్దని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఫీజుల నియంత్రణ పేరుతో బడ్జెట్ స్కూళ్లను ఇబ్బందిపెట్టవద్దని పునరుద్ఘాటించాయి. ఫీజు నియంత్రణ చట్టం రూపకల్పనపై పాఠశాల విద్యాశాఖ బుధవారం సంప్రదింపులు జరిపింది.
సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించింది. పలు సంఘాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు. ఏటా 15శాతం ఫీజులు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఫీజుల పెంపు 15శాతం మించితేనే ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆధీనంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసులు అమలుచేయాలని కోరారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీలను ఏర్పాటు చేస్తే ఫీజుల నియంత్రణ అదుపు తప్పి, అవినీతి పెరుగుతుందని ఓ పాఠశాల యజమాని తన వాదన వినిపించారు.