హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ పెంపుపై అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. విద్యాపరమైన అంశాలపై మాట్లాడేందుకు తనకేం భయం, మెహమాటం లేదని, ఇంత తెలిశాక భయపడటం దేనికని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ అబిడ్స్ మెథడిస్ట్ కాలేజీలో ఆదివారం జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేవలం 7.4 శాతం నిధులను కేటాయించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు. మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగా 15 శాతం నిధులు కేటాయించాల్సిందేనని, బడ్జెట్ను పెంచాల్సిందేనని, లేకపోతే భారీ తప్పిదమవుతుందని హెచ్చరించారు. దేశంలో విద్యకు సింగిల్ డిజిట్ శాతం బడ్జెట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా 100 మంది ఆడపిల్లలు ఒక్క టాయిలెట్ ముందు క్యూకట్టడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టినట్టయింది.