Mahesh Babu | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు చెందిన సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను మోసం చేశారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టాలీవుడ్ హీరో మహేశ్‌బాబుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని, యాడ్స్‌తో ఆ రెండు సంస్థల ప్రాజెక్టులను ప్రమోట్ చేసినందుకు తీసుకున్న మొత్తంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈడీ వర్గాల కథనం ప్రకారం.. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులను ప్రమోట్ చేసినందుకు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించారు. అందులో రూ.3.4 కోట్లు చెకు ద్వారా, మరో రూ.2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్టు తెలుస్తున్నది. ఈ నగదును మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించినట్టు ఈడీ అనుమానిస్తున్నది. మహేశ్‌బాబు ప్రచారం చేయడం వల్ల చాలామంది సామాన్య ప్రజలు ఆయా సంస్థల మోసపూరిత పద్ధతుల గురించి తెలియక పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ చెప్తున్నది.