హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్‌ను నమోదుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని తొమ్మిది చోట్ల ఈడీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. మనీలాండరింగ్ కోణంలో చేపట్టిన ఈ సోదాలు తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంలో గల తొమ్మిది సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లు, పలువురు వైద్యుల ఇండ్లలో కొనసాగాయి.
సంతానం లేని దంపతుల నుంచి సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలుచేసినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం దవాఖానకు వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లలను డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారని విచారణలో తేలింది. అనంతరం సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారని తేల్చారు. నాలుగేండ్లలో దాదాపు రూ.500 కోట్ల వరకు లావాదేవీలు జరిపినట్టు సిట్ ఆధికారులు గతంలోనే గుర్తించారు. సికింద్రాబాద్‌తోపాటు విశాఖపట్టణంలో ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారా ఈ దందా కొనసాగించారనే ఆరోపణపై విచారణ చేస్తున్నారు.