హైదరాబాద్: హైదరాబాద్లో రెండో రోజూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా సురానా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ డైరెక్టర్ల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర సురానాతోపాటు సాయి సూర్య డైవలపర్స్ సతీశ్ ఇంట్లో పెద్ద మొత్తం నగదు పట్టుబడినట్లు తెలుస్తున్నది.
పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. నిధుల బదలాయింపుతోపాటు భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతున్నది.
సురానా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ.3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2021 ఫిబ్రవరిలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో రూ.11.62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.