హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్టు తమ సోదాల్లో తేలిందన్నారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నారని తెలిపారు. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ పేరొంది. మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. బ్యాంకు చైర్మన్ రమేశ్‌కుమార్ బంగ్, వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్, ఎండీ ఉమేశ్చంద్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించాయి.