హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది.
అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సందర్భంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇదే సర్వేనంబర్‌లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్‌ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అమోయ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని నిర్దేశించింది.