హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రీ-లాంచ్‌ల పేరిట రూ.వేల కోట్ల మోసానికి పాల్పడిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మొదలైంది. ఐదు రోజుల కస్టోడియల్ విచారణలో భాగంగా సోమవారం తొలి రోజు ఈడీ అధికారులు పలు ప్రశ్నలతో ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.
సాహితీ ఇన్ఫ్రా పేరుతో వందల మంది నుంచి భారీగా డబ్బులు ఎలా వసూలు చేశారు? ఆ సొమ్మును ఎలా చేతులు మార్చారు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? ఏమేమి ఆస్తులు కొన్నారు? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ గత నెల 29న లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రీ-లాంచ్‌ల పేరుతో సాహితీ ఇన్ఫ్రా సంస్థ దాదాపు 1,600 మంది కస్టమర్ల నుంచి రూ.2 వేల కోట్ల మేరకు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన దర్యాప్తు అధికారులు.. లక్ష్మీనారాయణ ఆర్థిక లావాదేవీలతోపాటు ఈ కుంభకోణంలో ఇంకెవరి పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు.