హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): గొలుసుకట్టు విధానంలో డబ్బులు వసూలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్న కేసులో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన 50 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. అందులో ఉన్న రూ.137 కోట్లను అటాచ్ చేసింది. పెట్టుబడులకు భారీగా లాభాలు ఇస్తామని ఆశ చూపుతున్న క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కమిషనరేట్ పరిధిలో మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ ఆధారంగా రెండు సంస్థలపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నెల 24న హైదరాబాద్, బెంగళూర్‌లో ఏడుచోట్ల సోదాలు చేసింది. విలువైన పత్రాలు, పెన్‌డ్రైవ్, హార్డ్డిస్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నది.