హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోన్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగనున్నది. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో హవాలా రూపంలో నగదు తరలింపుపై దృష్టిపెట్టిన ఈడీ అధికారులు.. తర్వలోనే చర్లపల్లి తతంగంపై ఈసీఐఆర్ నమోదు చేయనున్నారు. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబరేటరీస్‌లో సీజ్ చేసిన శాంపిల్స్‌ను తీసుకున్నది. మరోవైపు భారీగా నగదు చేతులు మారిందనే కోణంలో ఈడీ అధికారులు స్థానిక పోలీసుల నుంచి సమాచారం సేకరించినట్టు తెలిసింది.
వాహనాలకు రిఫ్లెక్టర్లు తప్పనిసరి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాత్రివేళ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర రవాణాశాఖ రంగంలోకి దిగింది. వాహనాలు రాత్రిపూట కనిపించేలా రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు అతికించాలంటూ ఆ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 ప్రకారం వాహనం వెనుకభాగంలో మార్కింగ్ ప్లేట్ తప్పనిసరిగా అమర్చాలని పేర్కొన్నారు. భారీ వాహనాలు రాత్రివేళ నెమ్మదిగా వెళ్లడం, రోడ్డుపై పార్క్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్ వాహనాలు, 3.5 టన్నుల నుంచి 7.5 టన్నులు, అంతకంటే ఎక్కువ బరువును మోసుకెళ్లే గూడ్స్ వాహనాలు, ఏడుగురితో ప్రయాణించే క్యాబ్‌లు, ఆటోలు, 8 సీటింగ్, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు, ట్రాక్టర్లు సహా కన్స్ట్రక్షన్ రంగానికి ఉపయోగపడే అన్ని వాహనాలు, ట్రైలర్లు, సెమీ ట్రైలర్లు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు వాడాలని ఆదేశించారు.