హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.3,339 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. 4 రాష్ట్రాల్లో 2,254 ఆస్తులను అటాచ్ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీలో సీజ్ చేసిన ఈ ఆస్తుల విలువ మారెట్ ధర ప్రకారం రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు
ఎన్నికల్లేక చేనేత సంఘాలు నిర్వీర్యం ; సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకట్రాములు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): 12 ఏండ్లుగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేకపోవడంతో సహకార వ్యవస్థ నిర్విర్యమైందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తునే.. వాయిదా వేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సహకార వ్యవస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే చేనేత సహకార సంఘాలు, టెసోకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జియోట్యాగ్ లేని మగ్గాలన్నింటికీ జియోట్యాగ్ వేసి.. నేతన్నలు, అనుబంధ కార్మికులకు నేతన్న పొదుపు పథకం(త్రిఫ్ట్) వర్తింపజేయాలని కోరారు. చేనేత అభయహస్తం అమలును వేగవంతం చేసి అర్హత కలిగిన కార్మికులకు అందించాలని సూచించారు. చేనేత రుణాలను మాఫీ చేస్తామన్న వాగ్దానం నేటికీ నెరవేరలేదని.. వెంటనే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.