హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సైకోట్రోఫిక్ ఔషధాలను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కేసులో ఈడీ రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బుధవారం జప్తు చేసిన ఆస్తుల్లో 22 స్థిరాస్తులు, 8 చరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది. అటాచ్ చేసిన స్థిరాస్తులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఆశిష్ జైన్, అతని కుటుంబసభ్యుల పేరు మీద ఉన్నాయని ఈడీ తెలిపింది. బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.46 కోట్లు చరాస్తులు ఉన్నట్టు ఈడీ స్పష్టం చేసింది.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 26 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొకిరాల విశ్వప్రసాద్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్ 2న జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణలో డీసీసీ విశ్వప్రసాద్‌రావు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి డీసీసీ అధ్యక్షుడు కొకిరాలతోపాటు ఆయన అనుచరులు అనిల్‌గౌడ్, అసద్, రమేశ్, చరణ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ విషయమై సీఐ రవీందర్‌ను ఫోన్లో సంప్రదించగా లిఫ్ట్ చేయలేదు.