హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణకు ప్రఖ్యాత బిజినెస్ డైలీ ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందజేసింది. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కొనియాడింది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన ‘డిజిటెక్ కాంక్లేవ్-2022’లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఈ పురసారాన్ని అందుకొన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న సంసరణలతో పాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.
కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలు, క్షేత్రస్థాయిలో విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీసేవ కార్యకలాపాల్లో తీసుకొచ్చిన మార్పులను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్‌లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు. కేంద్రం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అత్యుత్తమ సేవలకు ఎకనామిక్ టైమ్స్ అవార్డు మరో నిదర్శనమని వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.