వనస్థలిపురం/రంగారెడ్డి, జూన్ 18: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్టులో రూ. 17.84 కోట్లతో చేపట్టిన ఎకో పార్కు పనులను సీఎం ప్రారంభించి మొక్కలు నాటారు. గుర్రంగూడ ఎకోపార్కు అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని చెప్పారు.
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్టుతోపాటు నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునికీకరణ, నివాస భవనాలు, ఇతర అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో రూపుదిద్దుకొంటున్న ప్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కొండాసురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అటవీ సిబ్బందికి నాలుగు పురస్కారాలు : మంత్రి సురేఖ
వన మహోత్సవం-2026 ప్రారంభోత్సవాన్ని పురసరించుకుని సర్కార్ ‘తెలంగాణ రాష్ట్ర వనసంరక్షణ ప్రతిభా పురసార పతక నియమావళి’ని అమల్లోకి తెచ్చింది. ఇందులోభాగంగా తెలంగాణ వన సంరక్ష(రజతం), ఉత్తమ వన సంరక్ష(వెండి), విశిష్ట వన సంరక్ష(బంగారం), ముఖ్యమంత్రి వన శౌర్య పతకం(ప్రత్యేక బంగారు పతకం) పేర్లతో నాలుగు పురసారాలను ప్రవేశపెట్టింది. వన సంరక్ష పతకానికి రూ.10,000, ఉత్తమ వన సంరక్షకు రూ.15,000, విశిష్ట వన సంరక్షకు రూ.20,000, ముఖ్యమంత్రి వన శౌర్య పతకానికి రూ.25,000 నగదు బహుమతిని అవార్డుగ్రహీతలకు అందజేస్తారు.
అదనంగా నెలవారీ నగదు ప్రోత్సాహకం కూడా అందజేయనున్నారు. అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడటం, అటవీ నేరాల నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నర్సరీల నిర్వహణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్), మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్), పరిశోధన తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ అవార్డులకు ఎంపిక చేయనున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లేదా ప్రభుత్వం నిర్ణయించిన ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.