హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో విడుదలకానున్నాయి. ఈ నెల 20లోపు ఫలితాలు విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఈసెట్ పరీక్షను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 86 పరీక్ష కేంద్రాల్లో 19,672 మందికి 18,928 మంది (96.22%) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ కుమార్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. తొలుత ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ ‘కీ’ని విడుదల చేసి ఫలితాలు ప్రకటిస్తారు.