(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహిస్తున్నది. ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో లేదా వివిధ నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని పట్టుబడుతున్నది. ఈ క్రమంలో ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే ఏమౌతుంది? అలాంటి ఓట్లను ఈసీ ఎలా గుర్తిస్తుంది? డూప్లికేట్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి? దీనిపై చట్టంలో ఏం ఉంది? అనే విషయాలపై ఈసీ అధికారులు, న్యాయనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఏడాది జైలు
భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో, ఒక నియోజకవర్గంలో, ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఏ వ్యక్తి అయినా ఒక ఎన్నికలో ఒకసారి మాత్రమే ఓటేయాలి. రెండు చోట్ల ఓటు వేయడం నేరంగా పరిగణిస్తారు. వేర్వేరు రాష్ర్టాల్లో లేదా వేర్వేరు నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారికి, లేదా రెండు ఎన్యుమరేషన్ పత్రాలు నింపినవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఈసీ అధికారులు చెప్తున్నారు. డూప్లికేట్ ఓటింగ్‌కు పాల్పడిన వ్యక్తికి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని 31వ విభాగం ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉన్నదని న్యాయనిపుణులు చెప్తున్నారు.
డూప్లికేట్ ఓట్లను ఎలా గుర్తిస్తారు?
రాష్ట్రంలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ ద్వారా గుర్తిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో డూప్లికేట్ ఓట్లు ఉంటే గుర్తించడానికి ఇలాంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రస్తుతానికైతే లేనట్టు తెలుస్తున్నది. అయినప్పటికీ, వేర్వేరు రాష్ర్టాల్లో ఇలాంటి ఓట్లను గుర్తించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏఐ సాంకేతికతతో పనిచేసే కేంద్రీకృత వ్యవస్థను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. డూప్లికేట్ నమోదులను గుర్తించినప్పటికీ సదరు ఓటును వెంటనే తొలగించబోరని అధికారులు చెప్తున్నారు. ముందుగా సంబంధిత ఓటరుకు నోటీసు ఇచ్చి వివరణ కోరుతారు. అవసరమైతే బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అనంతరం చట్టపరమైన విధానాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు.
రెండు రాష్ర్టాల్లో ఓటు ఉంటే ఏం చేయాలి?
ఉద్యోగరీత్యా మరేఇతర కారణం చేత ఓటరు గత ఓటుహక్కును కోల్పోకుండానే మరోచోట కొత్తగా ఓటుహక్కును పొందినట్లయితే, తనకు రెండు ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఈసీ అధికారులకు తెలియజేయాలి. ఓటరు తన వివరాలను పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రంలో లేదా మునుపటి రాష్ట్రంలో ఎక్కడ నచ్చితే అక్కడ ఒక్క చోట మాత్రమే ఓటు కొనసాగేటట్లు చూసుకోవాలి. రెండో ఓటును తొలగించాలని అధికారులకు తప్పనిసరిగా దరఖాస్తు సమర్పించాలి. దీని కోసం ఫారమ్-7ను వినియోగించాలని ఈసీ అధికారులు సూచిస్తున్నారు.