హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రకులాల జనాభాలో 90 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్టు తెలిపారు. వారి సంక్షేమం కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మాదిరిగా ఈబీసీ విద్యార్థులకు స్టడీసర్కిల్, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేయాలని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు బొడ్డు రవిశంకర్‌రావు, చందు జనార్దన్, నీలగిరి దయాకర్‌రావు, గట్టు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.