హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఈటల రాజేందర్ రాసిన లేఖ దళిత కాలనీల్లో అగ్గి రాజేసింది.పథకాన్ని ఆపేయమనడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ దళిత కాలనీల ప్రజలు రోడ్డెక్కారు.
ఈటల ఈసీకి రాసిన లేఖ ప్రతులను చింపివేస్తూ నిరసన తెలిపారు. వీణవంకతోపాటు, మండలంలోని వల్బాపూర్, మామిడాలపల్లిలో నిరసనలు మిన్నంటాయి. మహిళలు ఈటలకు శాపనార్థాలు పెట్టారు. తమ బతుకుల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాన్ని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నాడంటూ మండిపడ్డారు. తమ మేలును ఓర్చుకోలేని ఈటలను దళితకాలనీల్లో అడుగు పెట్టనీయబోమని శపథం పట్టారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ తమ నోటికాడి బుక్క ను ఎత్తగొట్టేందుకు యత్నిస్తున్నారని హుజూరాబా ద్ నియోజకవర్గ దళితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈటల లేఖ రాయడంపై మండిపడ్డారు. కుట్రలు పన్నేందుకు మేమే దొరికామా? అని నిలదీశారు. దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నామని, ఇలాంటి పథకాన్ని ఓటమి భయంతో నిలిపివేసేందుకు ఈటల కుట్రలు పన్నుతున్నాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీణవంక మండలం వల్బాపూర్‌లో దళితులు రోడ్డెక్కారు. కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా చేశారు. ఈటలకు వ్యతిరేకంగా నినదించారు. ఇన్ని రోజులు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోలేదని.. తరతరాల తమ బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే ఈటల తమకు కాకుండా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పథకాన్ని ఆపించి, ఓట్లడిగేందుకు కాలనీలకు ఎలా వస్తావని ప్రశ్నించారు. మండలంలోని మామిడాలపల్లిలో ఈటల రాసిన లేఖల ప్రతులను చింపేసిన మహిళలు.. ఆయనకు శాపనార్థాలు పెట్టారు. తాము లేకుండా ఈటల ఏ ఉద్యమాలు చేశాడని ప్రశ్నించారు.
ఈసీకి ఈటల లేఖ రాయడంపై నియోజకవర్గవ్యాప్తంగా దళితులు మీడియా సమావేశాలు పెట్టి ఖండించారు. సహజంగానే ఈటల స్వార్థపరుడని, ఒకరి మేలును కాంక్షించే నాయకుడు కాదని మండిపడ్డారు. తమకు దారి చూపుతుందని భావిస్తున్న దళితబంధును అడ్డుకుంటున్న ఈటలను తమ కాలనీల్లో అడుగు పెట్టనీయబోమని, వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. తమ బతుకు కోరుతున్న టీఆర్ఎస్ వెంటే ఉంటామని, సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని స్పష్టంచేశారు. ఓటమి భయంతోనే దళితబంధును ఆపే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు బాగుపడుతుంటే ఈటల ఓర్చుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఈటలకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని, తమ మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని, గెల్లు శ్రీనివాస్‌ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని దళితులు తేల్చిచెప్పారు.
దళితబంధు వస్తే మేం బాగుపడ్తమని ఈటలకు ఈర్ష్య. గందుకనే కుట్ర పన్నుతున్నడు. కుట్రలు పన్నడానికి మేమే దొరికినమా? బీజేపీకి పోయినంక ఆయన గుణాలన్నీ మారిపోయినయ్. ఆయన ఏడుపేందో ఆయన ఏడ్వక మా ఎంట ఎందుకు పడుతున్నడు? దళితుల బతుకులు బాగుపడుతున్నయంటే కడుపు మంటెందుకు? దళితబంధు నిలిపేయాలని ఈసీకి రాసిన లేఖను ఎంటనే వాపస్ తీస్కోవాలె. లేదంటే దళిత వాడల్ల తిరగనీయం.
జీడి వెంకటస్వామి, వల్బాపూర్
దళితబంధు పథకం మాకు కేసీఆర్ సారు ఇచ్చిండు. ఈటల ఎవలు అడ్డుకునెతానికి? మాకు ఇంటింటికి పది లచ్చలు బరాబర్ రావాలె. దళితబంధును అడ్డుకుంటే మా గోస తగుల్తది. మా బతుకులు ఎట్లున్నయో ఈటలకు తెల్వదా! ఆయన బాగు చెయ్యకపాయె. చేసెటోళ్లను చెయ్యనిస్త లేకపాయె. దళితబంధు వద్దని ఈటల ఎందుకు లెటర్ రాయాలె? మా మనుసుల కేసీఆర్ సారే ఉన్నడు. ఆయనకే ఓటేత్తం.
దరిపల్లి బుజ్జమ్మ, మామిడాలపల్లి