భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి 2.26 గంటల తర్వాత స్వల్పంగా భూమి కంపించడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలను జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం- ఎస్సీఎస్ అధికారులు నిర్ధారించారు. రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్టు వెల్లడించారు.
ఈ భూకంప కేంద్రం ఏపీలోని రాజమండ్రికి వాయవ్య దిశగా 111 కి.మీ దూరంలో భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. ఈ స్వల్ప భూకంపంతో ఎలాంటి నష్టం వాటిల్లినట్టు నివేదికలు అందలేదని ప్రకటించారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉండటంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.