హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): హిమాలయ ప్రాంతాల్లో ఒక్కసారిగా సంభవించే ఉత్పాతాలను ముందే పసిగట్టేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ (ఎన్జీఆర్ఐ) సంస్థ అధ్యయనం చేస్తున్నది. పర్వత ప్రాంతాల్లో జీవనదులు ఉప్పొంగడం, కుండపోత వానలు, కొండ చరియలు విరిగిపడటం, భూకంపాలు సంభవించడం వంటి సంఘటనల ప్రభావంపై ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్నవారిని ముందుగానే హెచ్చరించే వీలు ఉంటుందని ఎన్జీఆర్ఐ పరిశోధకులు చెప్తున్నారు. ఆయా ఉపద్రవాలను సిస్మోలాజికల్, జియోఫిజికల్ విధానాలతో ముందుగానే గుర్తించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హిమాలయ పర్వతాల్లోని పలు ప్రాంతాలను సందర్శించి ప్రాథమిక దశలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. కుండపోత వానలు, కొండచరియలు విరిగిపడటం, మంచు తుఫానులు, నదులు ఉప్పొంగడం, గడ్డకట్టిన మంచు కరిగిపోవడం, భూకంపాలు వంటివి పర్వత శ్రేణుల్లో తరుచూ సంభవిస్తుంటాయి. వీటి ప్రభావం హిమాలయాలకు సమీపంలో ఉండే ఉత్తర భారతం, ఈశాన్య రాష్ర్టాల్లోనూ కనిపిస్తున్నది.
కొనసాగుతున్న అధ్యయనం
జియోఫిజికల్, సిస్మోలాజికల్ విధానాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నమోదైన భూప్రకంపనల తీవ్రతను లెక్కించడానికి వీలవుతుందని ఎన్జీఆర్ఐ పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యయనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా భూప్రకంపనాల తీవ్రతతో ప్రభావితమై నదులు ఉప్పొంగడం, మంచుకొండలు విరిగిపడటం వంటివి సంభవిస్తున్నాయని గుర్తించారు. సిస్మోలాజికల్ తీవ్రతను పెంచి కొండప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదాలను అంచనా వేయడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నారు. తద్వారా ఆ ప్రాంతంలోని భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో కలిగే ఇబ్బందులను పక్కాగా అంచనా వేసి జరిగే ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు.
కంపనాల తీవ్రతే కీలకం
కొండప్రాంతాల్లో వచ్చే భూకంపాలతో కలిగే ప్రకంపనలే కీలకమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటితోనే మంచుకొండల్లో ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రకంపనాలకు భూకంపాలే రావాల్సిన అవసరం లేదని వాహనాల రాకపోకలు, జంతువుల గుంపు కదలికలు, నదీ ప్రవాహాలు పెరగడం వంటివి కూడా భూప్రకంపనలను వ్యాప్తి చేస్తాయని, వాటి తీవ్రతను బట్టి జరిగే ప్రమాదాలను గుర్తించే వీలు ఉంటుందని చెప్తున్నారు.