MultiStarrer | టాలీవుడ్లో తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న నటులు అల్లరి నరేష్, నారా రోహిత్ కలిసి ఓ సినిమాకు సిద్ధమవుతున్నారన్న వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరూ తమ కెరీర్లో భిన్నమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ, ఇటీవల కాలంలో కమర్షియల్ విజయాలు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా రాబోతోందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నారా రోహిత్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసిన అనుభవం ఉన్న ఆయన, ఇప్పుడు అల్లరి నరేష్‌ను కూడా జతచేసి పూర్తి స్థాయి కామెడీ–ఎమోషనల్ ఎంటర్టైనర్ రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్మాతగా హరీష్ పెద్ది వ్యవహరించనున్నారని సమాచారం. హీరోల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల్లరి నరేష్ కెరీర్‌ను పరిశీలిస్తే, తొలి సినిమా ‘అల్లరి’తోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కామెడీ హీరోగా సుదీర్ఘ ప్రయాణం సాగించారు. అయితే రొటీన్ కథలతో ప్రేక్షకులు విసుగు చెందడంతో ఆయన రూట్ మార్చి నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలవైపు మళ్లారు. ప్రయోగాలు చేస్తున్నప్పటికీ, భారీ కమర్షియల్ హిట్ మాత్రం దక్కకపోవడం గమనార్హం. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే, కెరీర్ ప్రారంభం నుంచే డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటూ ఇంటెన్స్ పాత్రలతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మధ్యలో కొంత విరామం తీసుకున్న ఆయన ఇటీవల వరుస సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మరోవైపు పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ – నారా రోహిత్ కాంబినేషన్ నిజమైతే, ఇద్దరి కెరీర్లకూ ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామెడీ, ఎమోషన్, కుటుంబ విలువలు మేళవించిన కథతో వస్తే ఈ మల్టీస్టారర్ ప్రేక్షకుల్లో మంచి స్పందన దక్కించుకునే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.