హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభంకానుంది. లోకల్, నాన్‌లోకల్ కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం, గురువారం జీవో జారీకావడంతో శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు లైన్‌క్లియర్ అయ్యిం ది. టీజీ ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ రెండింటికి హాజరయ్యేవారు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఫీజు చెల్లించాక లావాదేవి నంబర్‌ను జాగ్రత్తగా నోట్చేసుకోవాలని తెలిపారు. ప్సెట్ను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ సెల్‌ఫోన్ నంబర్, లేదంటే తల్లిదండ్రులు/సంరక్షకుల సెల్‌నంబర్‌ను పొందుపరచాలని వివరించారు. ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎప్‌సెట్ సమాచారాన్నంతా ఆయా మెయిల్ ఐడీకే పంపిస్తామని తెలిపారు.