హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ సీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కో సం ఈ నెల 7 నుంచి 11 వర కు నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి టాప్‌లో నిలిచారు. ఫలితాల సీడీ, పాస్‌వార్డును రాష్ట్ర విద్యాశాఖ ము ఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో కలిసి శనివారం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలుర కంటే బాలికలే అధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలురు 74.38 %, బాలికలు 75.85% క్వాలిఫై అయ్యారు.
అగ్రికల్చర్, ఫార్మసీలో కూడా బాలురు 88.25%, బాలికలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,54,750 మంది ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,40,618 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,80,424 మంది (74.98%) అర్హత పొందారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 1,00,432 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 91,633 మంది హాజరయ్యారు. వీరిలో 82,163 మంది (89.66%) ఉతీర్ణులయ్యా రు. కాగా, ఇంజినీరింగ్ విభాగంలో గతేడాది తో పోల్చితే ఈ సారి దరఖాస్తులు సంఖ్య పెరిగినప్పటికీ.. ఫలితాలు బాగా తగ్గాయి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో పెరిగాయి.
ఎప్‌సెట్ టాప్ టెన్ ర్యాంకుల్లో సగం వరకు ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలోనూ టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు పొందారు. ఇంజినీరింగ్‌లో 1, 2, 5, 6, 10 ర్యాంకులు, అగ్రి, ఫార్మా విభాగంలో 1, 2, 4, 7, 10 ర్యాంకులు కూడా ఏపీ విద్యార్థులకే దక్కడం గమనార్హం.
ఎప్‌సెట్ ఫలితాలు విడుదలైనందున ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీకి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు. అందుకోసం త్వరలోనే అడ్మిషన్ల కమిటీ సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్‌లో ఈ సారి పుష్కలంగా సీట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులెవ్వరూ సీట్లు రాలేదన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శ్రీనిధి, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ హోదా లేకపోయినా అడ్మిషన్లు నిర్వహించిన అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని చెప్పారు. అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ఓయూ, జేఎన్టీయూకు చెందిన కాలేజీలలో సర్దుబాటు చేశామని చెప్పారు. ఆ రెండు కాలేజీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.