హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని, అత్యంత భద్రతతో కూడిన ఈ-పాస్‌పోర్టులను త్వరలోనే జారీచేయనున్నట్టు విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఔసఫ్ సయీద్ చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ-పాస్‌పోర్టుల జారీ ఉంటుందని చెప్పారు. స్టేట్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పర్యటిస్తున్నది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన సమావేశమై మొబిలిటీ, వలసలు, ప్రవాస భారతీయులు వంటి అంశాలపై ప్రతినిధుల బృందం చర్చించింది. తెలంగాణ నుంచి వలసలకు సంబంధించి టీ-మైగ్రేషన్ యాప్‌ను రూపొందించామని సీఎస్ తెలిపారు. అనంతరం ఔసఫ్ సయీద్, చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ టీ ఆర్మ్‌స్ట్రాంగ్ చాంగ్సన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ-పాస్‌పోర్టు చిప్‌సెట్‌లో పాస్‌పోర్టులోని వ్యక్తి మొత్తం సమాచారం.. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు చిప్, యాంటెన్నా వెనక కవర్లో ఉంటుందని, విమానాశ్రయాల్లో అత్యంత వేగంగా పాస్‌పోర్టుల తనిఖీకి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మోసాలకు ఆస్కారం లేకుండా, డాటాను దొంగిలించే అవకాశం లేకుండా, నకిలీవి రూపొందించే వీలు లేకుండా ఈ-పాస్‌పోర్టులు ఉంటాయని చెప్పారు.