హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): ఎంబీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో 12 మందికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎలక్ట్రిక్ ఆటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్య, ఉపాధి అవకాశాల్లో వారికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే ఆటో రిక్షా పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఆటో యూనిట్ విలువ రూ.3,22,910 కాగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో రూ.1,93,746లకు అందజేసిందని తెలిపారు. లబ్ధిదారులు తమ వాటాగా రూ.15 వేలు చెల్లిస్తే, బ్యాంకు రుణం కింద రూ.1,14,164 అందిస్తున్నదని వెల్లడించారు. మిగతా లబ్ధిదారులందరికీ త్వరలోనే అందజేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో మల్లయ్యభట్టు, వడ్డెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ విమలాదేవి, ఎస్బీఐ ఏజీఎం శ్రీనాథ్, మహీంద్రా సంస్థ ప్రతినిధి నాగేశ్వర్రావు, ఎంబీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
మాది సిద్దుల కులం. ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్న. డీజిల్ ధర పెరగటంతో రూపాయి మిగుల్తలేదు. రూ.350 దాన్క డిజీల్కే పోయేటివి. కుటుంబాన్ని ఎల్లదీసుడు కష్టమైతంది. కేసీఆర్ సార్ దయవల్ల ఇప్పుడు డీజిల్ భారం తప్పనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–గదిపాక శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈ-ఆటో ద్వారా ఎంతో మేలు చేకూరనున్నది. 4 గంటల్లోనే ఫుల్‌చార్జ్ అవుతుంది. 130 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరో గంటన్నర చార్జ్ చేస్తే 80 కిలో మీటర్లు పోవచ్చు. అంటే కిలో మీటరుకు 50 పైసలు మాత్రమే పడుతుంది. నాలుగేండ్ల వరకూ కంపెనీనే మెయింటనెన్స్‌ను నిర్వహించనున్నది. మేం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
అన్నదానం శివప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా