హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేను ఉదయం పూట మాత్రమే చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. రెండుపూటలా సర్వేచేయడం కుదరని ముఖ్యంగా సాయంత్రం పూట సర్వే చేయలేమని ప్రభుత్వానికి తెలిపాయి. కులగణనపై ఉపాధ్యాయుల సహకారాన్ని కోరుతూ ప్రభుత్వం బుధవారం సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, బుర్రా వెంకటేశం తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కులగణన ప్రాధాన్యతను సంఘాలకు వివరించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సర్వే సమయంలో ఇబ్బందుల్లేకుండా చూడాలని, సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నవంబర్ 10, 11, 17, 18 తేదీల్లో సెలవులు ఉన్నాయని, ఈ సెలవు దినాల్లో పనిచేస్తే సీసీఎస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులు తరహాలో సర్వే పారితోషికాన్ని కూడా పెండింగ్‌లో పెడతారా? అని ప్రశ్నించారు. సర్వే గౌరవ వేతనం విషయంలో తక్కువ చేయరాదని, ఆకర్షణీయమైన రెమ్యూనరేషన్ ఇవ్వాలని, సర్వే పూర్తికాగానే విడుదల చేయాలని కోరారు.
ఇప్పటికే పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, హెల్త్‌కార్డులు సహా పలు అంశాలపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, కనీసం రెండు డీఏలనైనా విడుదల చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఒక డీఏకే ఆమోదం తెలిపింది. దీనితో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సర్కారుపై గుర్రుగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సహకరించకపోతే, ఇబ్బందులు తలెత్తుతున్నాయనే శాంతపరిచే ప్రయత్నం చేసింది.
కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. తమ సమస్యలను పరిష్కరించాలని ముక్తకఠంతో విజ్ఞప్తి చేశారు. సమావేశానికి పీఆర్టీయూటీఎస్ నుంచి శ్రీపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, హెచ్ఎం అసోసియేషన్ నుంచి రాజభానుచంద్రప్రకాశ్, టీఆర్టీఎఫ్ నుంచి కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, తపస్ నుంచి హనుమంతరావు, ఎస్టీయూటీఎస్ నుంచి పర్వత్‌రెడ్డి, ట్రైబల్ టీచర్స్ ఫోరం నుంచి ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్, బీసీ టీచర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తదితరులు హాజయ్యారు. పెండింగ్ డీఏలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివిధ సంఘాల నేత లు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.