Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/బేగంపేట మార్చి 1 (నమస్తే తెలంగాణ): ల్యాండింగ్ సమయంలో హైడ్రాలిక్ వీల్స్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఓ విమానం దాదాపు మూడు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా కిందికి దించడంతో ఉత్కంఠకు తెరపడింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఏవియేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాయుసేన విమానంలో దుండిగల్ ఎయిర్‌పోర్ట్‌లో శిక్షణ పొందుతున్న 14 మంది విద్యార్థులను శిక్షణ నిమిత్తం తీసుకెళ్లారు.
మధ్యాహ్నం ల్యాండింగ్ చేసే సమయంలో హైడ్రాలిక్ వీల్స్ తెరుచుకోలేదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో దించేందుకు అధికారుల అనుమతి కోరారు. విమానంలో ఇంధనం నిండుగా ఉండటంతో ల్యాండింగ్ చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, మొత్తం ఇంధనం అయిపోయే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాలని అధికారులు పైలట్‌కు సూచించారు. దీంతో దాదాపు మూడు గంటలు విమానాన్ని ఆకాశంలోనే తిప్పారు. అనంతరం సగం తెరుచుకున్న వీల్స్‌తోనే బేగంపేట విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.