నిజామాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరెంట్ సరఫరా తీరుపై ఓ రైతు మధనపడుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ లేకపోతే పంట మొత్తం పోతదని, పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతున్నాడు. బీఆర్ఎస్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని పడుకుంటే.. కాంగ్రెస్ పాలనలో మాత్రం కరెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నాడు. ఇదే విషయమై నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడ్గల్ గ్రామానికి చెందిన రైతు యాళ్ల హనుమంత్‌రెడ్డి గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మొబైల్‌కు మెసేజ్ చేశాడు. అదే సమయంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియా సమావేశంలో ఉన్నారు. రైతు హనుమంత్‌రెడ్డి మెసేజ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘మా ఊర్లో అందరి పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి.
ఇప్పటి సంది మొదలుకుని నెల రోజుల దాకా నీళ్లు పారిస్తేనే పంట చేతికి వస్తది. లేకపోతే చేతికి పంట రావడం కష్టం. నెలరోజులకు సరిపడా కరెంట్ ఇస్తనే లేరు. ఈ ప్రభుత్వం రైతులను ఘోరంగా అవస్థలకు గురిచేస్తున్నది. కరెంట్ సక్కగా ఇస్తేనే.. నెల రోజులు పంటలకు నీళ్లు పారిస్తేనే గడ్డకు పడతాము. లేకపోతే అంతే సంగతి. రోజుకు ఏడు గంటలు, ఎనిమిది గంటలు కరెంట్ ఇస్తుండ్రు. లెక్క పత్రం లేదు. నాకు 25 ఎకరాలు ఒకేచోట సాగు భూమి ఉన్నది. ఈ కరెంట్‌తోని నీళ్లను తోటకు పారియ్యాల్నా? పొలంకు పారియాల్నా? అర్థమైతలేదు. పొద్దున 7గంటలకు కరెంట్ ఇస్తుండ్రు. సాయంత్రం 4.45 గంటలకు తీసేస్తుండ్రు. నడుమలో గంట నుంచి రెండు గంటలు తీసేస్తుండ్రు. నచ్చినట్టు కరెంట్ ఇస్తున్నరు. సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి అడిగితే పైనుంచి ఆదేశాలను చెబుతుండ్రు. పదేండ్లు కేసీఆర్ పాలనలో రైతులంతా గుండె మీద చేయి వేసుకుని పడుకున్నరు. ఇప్పుడు ఘోరమైన అవస్థలు పడుతున్నం’ అని ఆవేదన వ్యక్తంచేశాడు.