ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14: రంగారెడ్డి జిల్లా ‘అసైన్డ్ భూముల్లో వెంచర్’ వ్యవహారంలో అధికార యంత్రాం గం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నదా? దీనికి ‘ఔను’ అనే సమాధానమే వినిపిస్తున్నది. పీవోటీ కింద భూములు స్వాధీనం చేసుకుంటామంటూ రెవిన్యూ శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే, అవుటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నీటి వనరు పరిరక్షణలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా మాత్రం ఇందిరాసాగర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అధికార యంత్రాంగం దూకుడుకు ఎవరైనా కళ్లెం వేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాగన్‌పల్లి అసైన్డ్ భూములకు సంబంధించి తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. ప్రభుత్వపరంగా జరిగిన పట్టాల పంపిణీ కాకుండా గతంలో పెద్ద ఎత్తున నకిలీ పట్టాలు కూడా పంపిణీ చేసినట్టు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం-అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల సరిహద్దులోని భూముల వ్యవహారం తెరపైకి వచ్చి వారం దాటుతున్నా, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో దీని వెనక ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజిపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 261, 260-281 వరకు 586 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉండగా.. ఇందులో పలు సంస్థలకు చెందిన భూములు కూడా ఉన్నాయి.
వాటికి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. కానీ, నాగన్‌పల్లి పరిధిలోని లావుని పట్టా భూముల్లో రహదారుల నిర్మాణం చేపట్టడంతో వివాదం నెలకొన్నది. నిబంధనలకు ఇది విరుద్ధం కావడంతో రెవిన్యూ శాఖ అధికారులు 11.36 ఎకరాల విస్తీర్ణంలోని పలువురు రైతులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా బదలాయింపు చేసినందున పదిహేను రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఈ నెల 7న నోటీసులు ఇచ్చారు. గడువు తీరిన తర్వాత భూములు స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. కానీ, అనాజిపూర్ గ్రామ పరిధిలోని సీలింగ్ పట్టాల వ్యవహారంలో రెవిన్యూ శాఖ స్పందించకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది.
ఈ గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్లలో 586 ఎకరాల భూమి ఉంటే, అందులో సీలింగ్ పట్టా 146.35 ఎకరాల వరకు ఉన్నది. వీటిని గతంలోనే ప్రభుత్వం నిరుపేద రైతులకు పంపిణీ చేసింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలున్నాయి. వీటిపై రెవిన్యూ శాఖ అధికారులు దృష్టిసారించడం లేదు. పట్టా భూముల నెపంతో సీలింగ్ భూముల వైపు ఎవరినీ వెళ్లనీయడంలేదని పలువురు రైతులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ భూముల్లో భారీ యంత్రాలతో చదును చేసేందుకు చేపడుతున్న పనులతో వచ్చే మట్టి, పెద్ద పెద్ద రాళ్లను ఇందిరాసాగర్ బఫర్ జోన్ పరిధిలో వేస్తున్నారనే అంశంపై అధికార యంత్రాంగం దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. నీటిపారుదల శాఖ అధికారులుగానీ, హైడ్రాగానీ ఇప్పటివరకు ఇందిరాసాగర్ పరిరక్షణకు చర్యలు తీసుకోలేదంటే తెర వెనక పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీతో వెలుగులోకి నకిలీ పట్టాలు
ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి అసైన్డ్ భూముల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతున్నది. సర్వే నంబరు 189లో 179.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో గతంలోనే నాగన్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 60 మంది రైతులకు ప్రభుత్వం 120 ఎకరాల విస్తీర్ణంలో పట్టాలు పంపిణీ చేసింది. మరో 59.33 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. ఆ ఖాళీ భూములకు సంబంధించి గతంలోనే భారీఎత్తున నకిలీ పట్టాల పంపిణీ జరిగిన వ్యవహారం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నకిలీ పట్టాల పంపిణీ జరగ్గా… ఆ రైతుల పేర్లు రెవిన్యూ రికార్డుల్లోకి కూడా ఎక్కాయి. దీంతో వారికి పాసు పుస్తకాలు జారీ కావడంతో వారంతా బ్యాంకు రుణాలు తీసుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014లో రుణమాఫీ చేసింది. ఆ సందర్భంగా భూమిలేని వారి పేర్లు రుణమాఫీ జాబితాలో ఎందుకు ఉన్నాయంటూ నాగన్‌పల్లి గ్రామస్తులు ఆరా తీయడంతో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగుచూసింది. వెంటనే గ్రామస్తులు అప్పటి కలెక్టర్ రఘునందన్‌రావుకు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. నకిలీ పట్టాల పంపిణీ నిజమని తేలడంతో పలువురు రైతుల పట్టాలను రద్దు చేయడంతోపాటు అప్పటి వీఆర్వో రఫీక్‌ను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా రద్దు చేసిన వారిలో నిజమైన రైతులు కూడా ఉన్నామంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పటికీ ఆ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నది. అయితే వంద అడుగుల రహదారి నిర్మాణం తెరపైకి వచ్చినప్పుడు ఇద్దరు రైతులు ఆ భూమి తమదంటే తమది అంటూ ఘర్షణకు దిగారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.