హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక డీఏ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఉద్యోగులను వంచించడమేనని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులు దవాఖాన ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఒకసారి 42 శాతం, మరోసారి 30 శాతం చొప్పున భారీ ఫిట్మెంట్ను ఇచ్చి వారి హృదయాల్లో నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ సరార్ కాలయాపన చేస్తూ పీఆర్సీని గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీని ప్రకటించి, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిట్మెంట్ శాతానికి ఏమాత్రం తగ్గకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కో రారు. ఇప్పటికే ఉద్యోగులు సహనంతో ఉన్నారని, వారిని ఇంకా పరీక్షించవద్దని అన్నారు. ఉద్యోగుల హకుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ లోపల, బయట పోరాటాన్ని తీవ్రస్థాయిలో ఉధృతంచేస్తామని ఆయన ప్రభుత్వాని హెచ్చరించారు.