హైదరాబాద్, జనవరి6 (నమస్తే తెలంగాణ): ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో అత్యధికంగా 16.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, వరంగల్, జనగాం, మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, ములుగు, నిజామాబాద్, కుమ్రం భీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగర వాతావరణం కశ్మీర్‌ను తలపిస్తున్నది. గడిచిన రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం గ్రేటర్‌వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. తెల్లవారుజాము నుంచి దాదాపు ఉదయం 8 గంటల వరకు నగరం మంచు దుప్పటి కప్పుకున్నట్టు కనిపించింది. మరో రెండు రోజులు ఈ గాలులు వీచే అవకాశం ఉండటంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 14.1 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 14.7, నిర్మల్ 16.5, మంచిర్యాల జిల్లాలో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సిద్దిపేట జిల్లా చీకోడ్‌లో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 15.8 డిగ్రీలు, మెదక్ జిల్లా రామాయంపేటలో 18.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠంగా 16 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలకు పడిపోయాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత కనిష్ఠానికి పడిపోనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో 10-13 డిగ్రీలు, దక్షిణ తెలంగాణలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈశాన్యం వైపు నుంచి గాలులు వీస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు ఆగ్నేయం వైపు నుంచి గాలులు వీచాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి వరకు ఈశాన్యం వైపు నుంచి గాలులు వీస్తాయి. ఈ ఏడాది 13 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. నగరంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలు గతంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. విండ్ కంటిన్యుటీ శుక్రవారంతో క్లియరైపోయింది.
-నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్
వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతోపాటు జల్లులు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటికే జలుబు, జ్వరం కేసులు పెరిగాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణం చేసేవారు చెవులు, ముక్కు కవర్ అయ్యేలా మంకీ క్యాప్ లేదా మఫ్లర్స్లాంటివి వినియోగించాలి. జలుబు, జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
-డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా