మంథని/హుస్నాబాద్‌రూరల్, జనవరి 12 : జిల్లాల పునర్విభజనపై కొన్ని మీడియాల్లో జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం సామాజిక కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి, గంగాపురి వద్ద బొక్కలవాగుపై వంతెన, పోచమ్మగుళ్ల సుందరీకరణతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంథని మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలపై కొన్ని సోషల్ మీడియా, మీడియా సంస్థల్లో చేస్తున్న ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి ప్రచారం తగదని పేర్కొన్నారు. వీటిని వెంటనే మానుకోవాలని విజ్ఞప్తిచేశారు.
హుస్నాబాద్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు తిరిగి హుస్నాబాద్‌ను కరీంనగర్లో కలుపుతామని బీసీ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద ఏర్పాటుచేయనున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు మంత్రి, కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల సైంటిఫిక్ మెథడ్‌లో భాగంగా మార్పులు, చేర్పులు జరిగితే ఈ ప్రాంతాన్ని కరీంనగర్లో కలుపడం తథ్యమని పేర్కొన్నారు. పార్క్‌ను ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు.