హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఏసీబీ దాడుల్లో బయటపడిన సుమా రు రూ.300 కోట్ల అక్రమాస్తులు డీఎస్పీ భీంరెడ్డివేనా? ఆయన ఎవరికైనా బినామీగా ఉన్నాడా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. సంకిరెడ్డి భీంరెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల అంతర్గత విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నాయి. కొందరు రాజకీయ నేతలకు, ఓ మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారికి భీంరెడ్డి బినామీగా ఉండటం వల్లనే అన్ని వందల కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికాధిపతి, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)తో భీంరెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయనతోపాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ డీసీపీ, ఓ జిల్లా ఎస్పీతో కూడా ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు సమాచారం. వీరే కాకుండా బీజేపీకి చెందిన ఓ సీనియర్ మహిళా నాయకురాలికి ఇంట్లో మనిషిగా అతడు అన్ని వ్యవహారాలు చక్కదిద్దినట్టు ఏసీబీ వర్గాలు గుర్తించాయి. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ నాయకులతో భీంరెడ్డికి ఉన్న ఆర్థికపరమైన సంబంధాల గురించి తెలిసి అవాక్కవుతున్నారట. ఆ లి స్టంతా తీస్తే.. చాలానే ఉంటుందని పోలీసు వర్గాలు చెప్పుకొంటున్నాయి.
కలబురిగిలో 38 ఎకరాలు ఎవరివి?
డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి చెందిన అక్రమాస్తుల్లో కర్ణాటకలో కనుగొన్న 38 ఎకరాలు ఎవరివి? అన్న ప్రశ్న సంచలనంగా మారింది. ఆ భూముల గురించి ఏసీబీ అధికారులు సైతం సరైన వివరాలు మీడియాకు వెల్లడించలేదు. ఆ భూముల వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా ఆరా తీయగా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని కలబురిగి పట్టణ సమీపంలో ఉన్నట్టు తెలిసింది. ఈ 38 ఎకరాలు కూడా ఆ మాజీ ఐపీఎస్ అధికారివే అని ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నట్టు తెలిసింది. ఆ మాజీ ఐపీఎస్ అధికారి తన ఉద్యోగకాలంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును తన బినామీ అయిన సంకిరెడ్డి భీంరెడ్డికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు.
తన సర్వీసు మొత్తం ఫోకల్ పోస్టింగ్‌లే..
తన సర్వీసులో భీంరెడ్డి ఆ మాజీ ఐపీఎస్ అధికారి ప్రోత్సాహంతోనే 1995 నుంచి ఎక్కడా లూప్లైన్లో లేకుండా అన్నీ ఫోకల్ పోస్టింగ్‌లే పొందాడని వినికిడి. ఆ ఐపీఎస్‌లో అండర్లోనే మొత్తం సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వహించారని చెప్తున్నారు. విధులు చేపట్టిన ప్రతి చోటా ఆయన అండ చూసుకొని అక్రమంగా సంపాదించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ప్లాట్లు, ఫ్లాట్లు తమ బంధువులు, స్నేహితుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ప్రతి పనిలోనూ ఆ ఉన్నతాధికారికి వాటా ఇవ్వడంతో అతనికి శాశ్వత బినామీగా భీంరెడ్డి ముద్రపడిపోయాడని సమాచారం. అయితే ఆ మాజీ ఉన్నతాధికారితోపాటు.. పలువురు రాజకీయ నేతలకూ భీంరెడ్డి బినామీగా ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. భీంరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, కోడ్ లాంగ్వేజ్, వాట్సాప్ చాట్స్ డీకోడ్ చేస్తే.. తాను ఎవరెవరికీ బినామీగా ఉన్నది.. భీంరెడ్డికి ఎవరెవరు బినామీగా ఉన్నదీ బయటపడుతాయని అంటున్నారు.
భీంరెడ్డి నెట్వర్క్ మామూలుగా లేదు
డీఎస్పీ భీంరెడ్డి తన సర్వీసులో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సత్సంబంధాలు నెరిపినట్టు ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలైతే అతనితో పనులంటే క్యూలో ఉంటారని తెలిసింది. బీజేపీకి చెందిన నేతలతో ఆయన ఏకంగా వ్యాపార సంబంధాలు పెట్టుకున్నట్టు సమాచారం. అందుకే అరెస్టు నుంచి మినహాయింపు పొందేందుకు పెద్ద ఎత్తున పైరవీ చేశారని వినికిడి. ప్రజల నుంచి నుంచి ఏసీబీకి తీవ్ర ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక అరెస్టు చేశారని అంటున్నారు.
మొత్తం 70 చోట్ల ప్లాట్లు, ఫ్లాట్లు
ఏసీబీ అధికారులు భీంరెండ్డి నివాసాల్లో మొదటిరోజు వెలికితీసిన అక్రమాస్తులతోపాటు.. ఆ తదుపరి జరిపిన విచారణల్లో మరిన్ని అక్రమాస్తులు బయటపడినట్టు తెలిసింది. ఇప్పటివరకు మొత్తం 70 చోట్ల ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇట్లాంటి సమస్య వస్తే తప్పించుకోవడానికి ఆ అక్రమ ఆస్తులేవి తన పేరుమీద లేకుండా భీంరెడ్డి జాగ్రత్త పడినట్టు ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం 15 మంది బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించగా.. ఈ 70 చోట్ల ఆస్తుల్లో మరికొందరు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అవన్నీ కలిపితే.. దాదాపు రూ.500 కోట్ల వరకు అక్రమాస్తులు లెక్క తేలే అవకాశం ఉందని సమాచారం. కాగా, వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తెతో తన కొడుకుకు పెండ్లి సంబంధం కూడా భీంరెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. ఓ ప్రముఖ దేవాలయ బోర్డు చైర్మన్‌తోనూ ఇతనికి ఉన్న ఆర్థికపరమైన, వ్యాపార సంబంధాలపై నెట్టింట చర్చ జరుగుతున్నది.