DSC | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మెగా డీఎస్సీ అంటూ హడావిడి చేసిన రాష్ట్రప్రభుత్వం పరీక్షల నిర్వహణలో స్పష్టత ఇవ్వడంలేదు. పేపర్లవారీగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. దీంతో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ పరీక్షను నిర్వహిస్తారో.. ఏ పేపర్‌కు ఎంత సమయం పాటు ప్రిపర్కావాలనో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ రాత పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనుండగా, ఉమ్మడి పది జిల్లాల్లోనే సెంటర్లను కేటాయించనున్నారు. పలువురు అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్‌తో పాటు, పలు సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేస్తే ప్రిపేర్కావడానికి వెలుసుబాటుగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కవ
డీఎస్సీకి ఈ ఏడాది 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండగా, ఈ పోస్టుకే అత్యధికంగా దరఖాస్తు చేసుకోవడంతో పోటీ ఎక్కువైంది. 2వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకోగా, 6వేలకు పైగా గల ఎస్జీటీ పోస్టులకు 88,007వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. లాంగ్వేజ్ పండిట్‌కు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు 11,992 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు.
కాగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ -2024 నోటిఫికేషన్‌ను జనవరిలో విడుదల చేసింది. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషాపండితులు, 182 పీఈటీ పోస్టులున్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 ఉన్నాయి.
సబ్జెక్టులవారీగా దరఖాస్తులు
డీఎస్సీలో మరో 15వేల పోస్టులు పెంచండి.. డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతులతో మరో 15వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ ద్వారా వాటిని భర్తీచేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. గ్రంథాలయాలు, స్టడీహాళ్ల ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 25వేలతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్ ప్రభుత్వం కేవలం 11వేల పోస్టులకే పరిమితం చేసిందని వాపోయారు. టీచర్లకు కల్పించిన పదోన్నతులతో 15వేల పోస్టులు ఖాళీఅయ్యాయ ని, వాటిని ఇదే డీఎస్సీలో చేర్చి భర్తీచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
మల్టీజోన్ -2లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 12 జిల్లాల్లో 6,013 మంది స్కూల్ అసిస్టెంట్లను సోమవారం విద్యాశాఖ అధికారులు బదిలీచేశారు. సంగారెడ్డి 834, జనగాం 335, యాద్రాద్రి 562, మేడ్చల్ 456, వికారాబాద్ 641, మహబూబ్‌నగర్ 397, జోగులాంబ గద్వాల 305, వనపర్తి 310, నాగర్‌కర్నూల్ 451, నల్గొండ 876, సూర్యాపేట 575, నారాయణపేట జిల్లాలో 271 స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు.