DSC | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూలోని ల్కాండ్ స్కేప్ గార్డెన్లో చదువుకుంటున్న డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుంటున్నారు. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే డీఎస్సీని వాయిదా వేసే ప్రసక్తే లేదని నిన్న విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు నిరుద్యోగుల నిరసనలు కొనసాగాయి. మళ్లీ ఇవాళ ఉదయం కూడా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. ల్యాండ్ స్కేప్ గార్డెన్లోకి ప్రవేశించిన పోలీసు బలగాలు.. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారు. కనిపించిన విద్యార్థిని కనిపించినట్టే అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నుంచి పోలీసులు బలవంతంగా సెల్ఫోన్లు లాక్కున్నారు. ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారంటూ విద్యార్థులు పోలీసులను నిలదీశారు. దీంతో విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
పోలీసు బలగాలను చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని గుర్తు చేశారు. అసలు యూనివర్సిటీలోకి పోలీసులకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. మేం ఉగ్రవాదులం కాదు.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని నిలదీశారు. తమ ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి.. తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. pic.twitter.com/LibvPFkW3D
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు
ఆందోళన చేస్తున్న DSC అభ్యర్థుల వెంటపడి అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. pic.twitter.com/WPFbQCUJQJ
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024