హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి ఎక్కువయ్యింది. మంగళ, శుక్రవారాల్లోనే ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు క్యూ కట్టారు. డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు సుమారు 70 మంది వరకు తరలివచ్చారు. 2008 డీఎస్సీలో మెరిట్ వచ్చి నా తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. దాదాపు 1200 మంది బాధితులుగా మారామని, 14 ఏండ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హోంగార్డుల సమస్యలపై సైబరాబాద్ హోంగార్డ్స్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, తెలంగాణ స్టేట్ ట్రెజర్ హరిబాబు సమస్యలు విన్నవించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్, ఆయుష్ శాఖ కమిషనర్ హరిచందన, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఫిర్యాదులను స్వీకరించారు.