హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తమకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి 50 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 200 మందికిపైగా అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు తరలివచ్చి తమ గోడు వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించి, ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్యాబినెట్ మంత్రులు, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి 50 రోజులు గడుస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేదనను అర్థం చేసుకొని, కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వారితో మాట్లాడారు. వెంటనే విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిషారం అయ్యేలా చూస్తానని అభ్యర్థులకు ఆయన హామీ ఇచ్చారు. కాగా మంగళవారం ప్రజావాణికి 614 దరఖాస్తులు అందాయి. ప్రపంచ పిల్లల దినోత్సవాన్ని పురసరించుకొని నేడు 11 గంటలకు పిల్లల కోసం ప్రజావాణి నిర్వహించనున్నట్టు తెలిపారు.