Farmers | నల్లగొండ రూరల్, మార్చి 2 : నల్లగొండ మండలం కేశరాజుపల్లెలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు చేసిన వందల ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితికి చేరింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చుక్క నీరు దొరికే పరిస్థితి లేకుండాపోయింది. వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదు. ఒక్కో రైతు ఐదు నుంచి ఆరు బోర్లు వేసినా ఫలితం కన్పించడం లేదు. చేసేదేమీ లేక ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి వరి పొలాలను తడుపుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తాగు నీటి సమస్యపై మహిళలు ఆగ్రహించారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉం టుందని మండిపడుతూ.. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరులో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోగా, కొన్ని నెలలుగా మోటర్లు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ వేలేరుపాడు-అశ్వారావుపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై వెదురు తడికలు, మొద్దులు, ముళ్ల కంచె, టెంట్లు వేసి నిరసన తెలిపారు. ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమీప పంట పొలాల మీదుగా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మహిళల ఆందోళన కొనసాగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరికి ఎంపీడీవో జీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మి, మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బాబు అక్కడికి చేరుకుని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
చెరువులను నీటి తో నింపాలని రైతులు ఆందోళనకు దిగారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామ స్టేజీ వద్ద అదే గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ నుంచి మండలంలోని ఇతర గ్రామాల్లో ఉన్న చెరువులకు నీరు వదులుతూ గ్రామంలోని ఇప్పలకుంట, ఎర్రకుంట చెరువుల్లోకి నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాస్తారోకోతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రాజగోపాల్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలోని ములకల్లవాడలో శనివారం తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ వాడకు మిషన్ భగీరథ పైపులైన్ వేయలేదనీ, అధికారులను అడిగితే దాట వేస్తున్నారని మండిపడ్డారు. తాగునీటి సమస్య మున్ముందు మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
కరీంనగర్ రూరల్, మార్చి 2: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో రాజీవ్హ్రదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, రైతులు మాట్లాడుతూ.. కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాల్లో ఎస్సారెస్సీ డీ 89, డీ 86, 3ఎల్, 11ఆర్ కాలువల ద్వారా 600 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉన్నదని, కనీసం 300 క్యూసెక్కులు కూడా రావడంలేదని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒత్తిడితో కరీంనగర్ మండలానికి రావాల్సిన నీటిని పెద్దపల్లికి తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. నీరందక చివరి ఆయకట్టు గ్రామాలైన ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడ్, చామనపల్లి, దుబ్బపల్లి, మొగ్దుంపూర్, చేగుర్తిలో వందలాది ఎకరాల పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేం లేక పశువుల మేతకు వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నీరందించి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టరేట్, నీటిపారుదల శాఖ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.
మాకు 8 ఎకరాల భూమి ఉన్నది. నీళ్లు సమృద్ధిగా లేకపోవడంతో యాసంగిలో 6 ఎకరాల్లోనే సాగు చేశా. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న మూడు బోర్లు పోయడం లేదు. పంటను కాపాకునేందుకు రెండు రోజుల నుంచి 16 ట్యాంకర్ల నీళ్లు పెట్టించిన. అయినప్పటికీ మరో పక్క ఒక మడి ఎండిపోయింది. గతంలో గిట్లాంటి పరిస్థితి చూడలె.
-మెడిశెట్టి చైతన్య, రైతు, కేశరాజుపల్లె, నల్లగొండ
నాకు 12 ఎకరాల భూమి ఉన్నది. తొమ్మిది బోర్లు ఉన్నాయి. గతంలో అవి పుష్కలంగా నీళ్లు పోసేవి. యాసంగి మొదలు పెట్టే సమయంలో నీళ్లు అందుతాయో లేవోనని 9 ఎకరాలు మాత్రమే సాగు చేసిన. ఇప్పుడు పంట పొట్టకొచ్చింది. ఉన్న తొమ్మిది బోర్లు పూర్తిగా అడుగంటాయి. నెల రోజుల్లో ఆరు బోర్లు వేసినా చుక్క నీరు పడలే. పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్న. వారం రోజుల్లో 50 ట్యాంకర్ల నీటిని పెట్టా. 9 ఎకరాల పంట పెట్టుబడికి మూడు లక్షలు, వాటర్ ట్యాంకర్లకు ఇప్పటివరకు రూ.40 వేలు ఖర్చు చేసిన. చివరికి రెండు ఎకరాలన్నా ఫలితం దక్కక పోతదా అనే ఆశ.
– ముత్తినేని పరశురాం, రైతు, కేశరాజుపల్లె, నల్లగొండ