హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేళ డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూ రో (న్యాబ్) గట్టి చర్యలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ను ప్రవేశపెట్టింది. ఒక్కో పోలీస్ కమిషరేట్‌కు 25 కిట్ల చొప్పన ఇప్పటికే పంపిణీ చేసినట్టు నార్కోటిక్ బ్యూ రో ఏడీజీ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌తో పరీక్షిస్తామని చెప్పారు.
ఆదివారం ఉదయం నుంచే రోడ్లు, పబ్స్, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్ వద్ద టెస్టులకు న్యాబ్స్ అధికారులు రెడీ అవుతున్నారు. లాలాజలంతోపాటు అవసరమైతే మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ తరహాలోనే డ్రగ్స్ తీసుకుంటే అప్పటికప్పుడే పాజిటివ్ రిపోర్టు వచ్చేలా ఈ మెషినరీ ఉంటుందని సందీప్‌శాండిల్య వెల్లడించారు. లాలాజలం, మూత్రం పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వస్తే ఆ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపుతారు. ఎవరిపైనైనా అనుమానం ఉంటే.. మూ డు రోజుల తర్వాత కూడా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు.