‘క్రీడల కోసం నిర్మించిన స్టేడియాలను పార్టీలకు ఇస్తారా.. మళ్లీ ఏదైనా అంటే దబాయిస్తున్నారు.’ గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి అన్న మాటలివి..
Uppal | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): క్రీడా మైదానాలను పార్టీలకు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్రెడ్డి గతంలో చెప్పిన మాట ఆచరణలో మాత్రం అటకెక్కింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మందు పార్టీకి వేదికైంది. బుధవారం ఉదయానికల్లా స్టేడి యం మొత్తం మద్యం బాటిళ్లతో డంపింగ్యార్డ్లా దర్శనమిచ్చింది. ఉదయం స్టేడియానికి వచ్చిన వాక ర్స్ పరిస్థితి చూసి షాక్ అయ్యారు. స్టేడియంలో కాక్టైల్ పార్టీ నిర్వహించడంపై మండిపడుతున్నారు. అసలు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. క్రీడా మైదానాన్ని లిక్కర్ పార్టీకి ఇచ్చిన ఘనత రేవంత్ సర్కారుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఉదయం నుంచి జోరుగా చర్చ సాగుతున్నది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఫొటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీటికి జోడించి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అద్దె కోసం కక్కుర్తిపడి ఇలా లిక్కర్ పార్టీకి ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
లిక్కర్పార్టీ ఇదే మొదటిసారి..!
ఉప్పల్ మున్సిపల్ స్టేడియాన్ని ఇప్పటివరకు సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కారు లిక్కర్ పార్టీకి కూడా అనుమతులిచ్చింది. దీనిపై ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ కొనసాగింది. సీఎం రేవంత్రెడ్డి చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడం కొసమెరుపు.