హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి ప్రాంతంలో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న వాగ్దేవి ల్యాబొరేటరీస్‌కు డ్రగ్ లైసెన్స్ లేదని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సోమవారం వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 12వేల కోట్ల విలువైన డ్రగ్స్ కేసుకు సంబంధించి.. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘నిద్రమత్తులో ఈగల్!.. మెడికల్ షాపులకే పరిమితమై న డీసీఏ’ అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్‌ను సందర్శించి.. వివరాలు సేకరిచింది. డీసీఏ విచారణలో వాగ్దేవి ల్యాబొరేటరీస్‌కు మందులు తయారు చేసేందుకు లైసెన్స్ లేదని గుర్తించింది. మెఫెడ్రోన్ డ్రగ్ మెడిసిన్ కాదని, అదొక ప్రమాదకరమైన మత్తుమందు అని తేల్చింది. డీసీఏ ఆ డ్ర గ్ను ఎప్పుడో నిషేధించిందని తెలిపింది. అది ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో ఈ విషయం పూర్తిగా ఎన్డీపీఎస్ పరిధిలోకి వస్తుందని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోవడానికి, దర్యాప్తు ప్రారంభించడానికి డీసీఏకు ఎలాంటి అధికారం లేదని తేల్చింది. అయితే, ఔషధాల మాటున అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న వైనాన్ని ఎందుకు గుర్తించలేదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.