హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం బాధాకరమైన విషయమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సురేఖ బర్తరఫ్ అంశంపై శుక్రవారం ఆయన స్పందించారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్ఠానం నుంచి కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. నాయకులకు తమ అభిప్రాయాలు, సమస్యలను చెప్పుకొనేందుకు పార్టీలో అంతర్గతంగా ఎన్నో వేదికలు ఉన్నాయని, వాటిని కాదని బహిరంగంగా మీడియాతో మాట్లాడటం క్షమించరాని తప్పిదమని ఆయన పేర్కొన్నారు. కొండా సురేఖ కుమార్తె చేసిన తీవ్ర వ్యాఖ్యలను కనీసం ఆమె ఖండించకపోవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత తీవ్రంగా పరిగణించిందని తెలిపారు.
పార్టీ నియమాలను ఖాతరు చేయని వైఖరి కారణంగానే అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మహేశ్‌కుమార్ వివరించారు. రాజకీయ లబ్ధి కోసం, ఒత్తిడి తేవడం కోసం ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం లేదని తేల్చిచెప్పారు. మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ, కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తామంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. పార్టీ విధేయత, క్రమశిక్షణను కాపాడేందుకు అధిష్ఠానం ఈ కఠిన వైఖరి అవలంబించిందని, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా హైకమాండ్ చూస్తూ ఊరుకోదని మహేశ్‌కుమార్ స్పష్టంచేశారు.