హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం గోదావరిలో 68.2 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్నది. నిన్నటి నుంచి శనివారం రాత్రి వరకు మూడు అడుగుల వరకు నీటిమట్టం తగ్గా.. ప్రస్తుతం 22.70లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.
భారీ వర్షాలతో నేపథ్యంలో గోదావరి వరద పోటెత్తింది. పట్టణంలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఈ క్రమంలో పారిశధ్య పనులు చేపట్టేందుకు అదనపు పారిశుధ్య సిబ్బంది, యంత్రాలను ప్రభుత్వం పంపింది. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 125 మంది అదనపు సిబ్బంది, పది జెట్టింగ్ యంత్రాలు, 15 మొబైల్ టాయిలెట్లు, 33 ఫాగింగ్ యంత్రాలను వెంటనే పంపాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు సిబ్బంది, యంత్రాలు భద్రాచలం చేరుకోవాలని చెప్పింది.